పంజాబ్లో తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో కూతురిని చంపించాడోక తండ్రి. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందనే ఏకైక కారణంతో తనకు పిల్లలు లేరని తన బావమరిది కూతుర్ని దాత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడు ఆ కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్తక్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం ఒక ఎత్తు అయితే ఆమెకు రక్షణగా అడ్డు వెళ్ళిన పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మరింత బాధిస్తోంది. వివరాలలోకి వెళితే హర్యానాలోని రోహ్తక్ పట్టణంలో నివాసముండే రమేష్ కి పిల్లలు కలగకపోవడంతో బావమరిది కూతురు మమతను రమేష్ 2002లో దత్తత తీసుకున్నాడు. అయితే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఆమె మైనర్ కావడంతో తన కూతురుకు మాయమాటలు చెప్పి సోంబిర్ ఇంచి నుంచి తీసుకుపోయాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. అయినప్పటికీ మమత ఇంటికి రాలేదు. ఇవాళ సోంబీర్ ను రోహ్తక్ కోర్టులో హాజరుపర్చారు. అయితే తన ప్రియుణ్ణి చూడటానికి వచ్చిన కూతురుని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తండ్రి రమేష్ నిన్ను మరికొద్దిసేపట్లో చంపేస్తానని బెదిరించాడు. అయితే అతడు కోపంలో అలా అంటున్నాడని అందరూ భావించారు. కానీ అలా అన్న కొద్దిసేపటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కోర్టు ఆవరణలోనే మమతను తుపాకీతో కాల్చి చంపారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన స్థానిక ఎస్సైపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా మృతిచెందాడు. మమత మైనారిటీ మరో కొద్దిరోజుల్లో తీరిపోనుండడంతో కోర్టులో ఇక కేసు నిలబడదని అందుకే రమేష్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.