హిందువులకు ప్రత్యేకించి తులసి గురించి చెప్పనక్కరలేదు, ఆ మొక్కని వారు దేవతగా పూజిస్తారు. ఆ విషయం పక్కన పెడితే తులసి ఔషధపరంగా చాలా విసిస్టత కలిగిన మొక్క. తులసి ఆకులను తింటే సకల రుగ్మతలు పోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల వ్యాధులను నయంచేయడానికి తులసి వాడుతారు.
ఇక తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చూస్తే :
* తులసి ఆకుల్ని వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.
* తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
* తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.