ఎపీని ముంచెత్తుతోన్న భారీ వర్షం….జలదిగ్బంధంలో కొన్ని ప్రాంతాలు…!

Heavy Rains In AP

కేరళలో వర్షాలు కాస్త తెరిపిచ్చాయి అనుకుంటే ఇప్పుడు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతకు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటూ ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఇక పంట పొలాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ లో 70 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.60 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కి విడుదల చేస్తున్న అధికారులు, పశ్చిమ కృష్ణ కాలువకు నాలుగువేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

ap-rains

పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట మండలంలో లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండటంతో గేట్లు పూర్తిగా ఎత్తేశారు. కాజ్ వేపై భారీగా వరద నీరు చేరడంతో నందిగామ, వీర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

rains-in-ap
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో కూడా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని.. అందుచేత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కేరళ రాష్ట్రం వరదల వల్ల అనుకోని విపత్తులో చిక్కుకుందని.. ఏ రాష్ట్రానికైనా ఇలాంటి విపత్తులు తప్పవని కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే ఎక్కువ శాతం నష్టం జరగకుండా చూడవచ్చని అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆహారం, మందులు కొరత లేకుండా చూడాలని ఎలాంటి అనుమానం ఉన్నా ముందస్తుగానే సహాయ శిబిరాలు ఏర్పాటు చేసుకొని జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.