Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాన్యుడి భావ వ్యక్తీకరణకు సరైన వేదికగా భావిస్తున్న సోషల్ మీడియా కొన్ని సార్లు అనర్థాలకూ దారితీస్తోంది. ఇష్టమొచ్చిన రాతలు రాసే వీలుండటంతో కొందరు నెటిజన్లు తమ నోటి దురుసుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నారు. తమకు నచ్చని మాటలు మాట్లాడిన వాళ్లపై ఇష్టారీతిలో దూషణలకు దిగుతున్నారు. ఇందుకు మతం, రాజకీయం, సినిమా అన్న తేడా లేదు. సోషల్ మీడియాతో ఒక్కోసారి సెలబ్రిటీలకే కాదు…సామాన్యులకూ మనసులో మాట చెప్పుకునే అవకాశం లేకుండా పోతోంది. తాజాగా తమిళ హీరో విజయ్ కేంద్రబిందువుగా జరుగుతున్న గొడవే ఇందుకు నిదర్శనం. గత వారం బాలీవుడ్ లో రిలీజయిన షారూఖ్ ఖాన్ సినిమా జబ్ హ్యారీ మెట్ సెజల్ చూసిన ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టు సినిమా గురించి ఓ కామెంట్ చేశారు. కాకతాళీయంగా అన్నారో లేక కావాలనే అన్నారో తెలియదు కాని….జబ్ హ్యారీ మెట్ సెజల్ ..కొన్నేళ్ల క్రితం విజయ్ నటించిన సురా చిత్రం కన్నా దారుణంగా ఉంది అని ట్వీట్ చేశారు. పరోక్షంగా.. సురా చిత్రం కూడా బాగాలేదు అన్న అర్థం వచ్చేలా ఉంది ఆ ట్వీట్…ఇది సహజం. సినిమా బాగాలేదనటం, ఓ సినిమాను మరో సినిమాతో పోల్చటం ఏ ప్రేక్షకులైనా సాధారణంగా చేసే పనే. కానీ ఈ వ్యాఖ్యలే ధన్యా రాజేంద్రన్ కొంప ముంచాయి. ఈ ట్వీట్ చేసిన మరుక్షణం నుంచే ఆమెకు సోషల్ మీడియాలో టార్చర్ మొదలయింది.
విజయ్ అభిమానులు ధన్యా రాజేంద్రన్ ను దూషిస్తూ.. మూడు రోజులు పాటు 63, 000 ట్వీట్లు చేశారు. ఈ టార్చర్ ను తట్టుకోలేక ధన్య పోలీసులను ఆశ్రయించారు. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని ఆమె ఫిర్యాదుచేశారు. కేసును విచారించిన పోలీసులు నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు., త్వరలోనే వారిని పట్టుకుంటామని, ఆ నలుగురూ వారి ట్విట్టర్ ఎకౌంట్ కూడా డిలీట్ చేశారని పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ వివాదంపై హీరో విజయ్ స్పందించారు. ధన్య రాజేంద్రన్ పై ఎలాంటి కామెంట్లు చేయవద్దని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మహిళల పట్ల తనకు చాలా గౌరవం ఉందని, సినిమా నచ్చకపోతే బాగాలేదు అని చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని, దీని గురించి తప్పుగా మాట్లాడవద్దని ఆయన అభిమానులను కోరారు. విజయ్ స్పందనతో ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుందని భావిస్తున్నారు. అభిమానం ఒక స్థాయి వరకు ఉంటే బాగుంటుంది కానీ…హద్దులు దాటి ఇతరుల అభిప్రాయాలను అవమానించే రీతిలో ఉండకూడదు. సినిమా బాగా లేదు అన్నంత మాత్రానా విజయ్ అభిమానులు ఇలా ఇష్టారీతిన నోరుపారేసుకోవటం సరైనది కాదని పలువురు అంటున్నారు.
మరిన్ని వార్తలు: