Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకలో బీజేపీ పరాభవంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేత డీకే. శివకుమార్ విషయంలో ఎంతో సంతృప్తిగా ఉన్న హైకమాండ్ ఆయనకు సముచిత పదవి ఇచ్చి గౌరవించాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి, బలపరీక్షలో గెలిచేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ, శివకూమార్ ఆ పార్టీ వ్యూహాలను విజయవంతంగా తిప్పికొట్టారు. ఎన్నికల్లో కర్నాటకలో పోటీచేసిన అభ్యర్థులందరిలో సంపన్నుడిగా గుర్తింపు పొందిన శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా నిరోధించారు. అన్నీ తానై చక్రం తిప్పి…ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వెంటే ఉండేలా చేశారు. బీజేపీ క్యాంపులోకి వెళ్లాలనుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, ఆనంద్ సింగ్ లను కూడా చాకచక్యంగా వెనక్కి రప్పించారు. వారిద్దరినీ తిరిగి కాంగ్రెస్ గూటికి ఎలా చేర్చానన్న విషయాన్ని కూడా శివకుమార్ స్వయంగా వెల్లడించారు.
దేవుడు తనకో మంత్రదండాన్ని ఇచ్చాడని, దాన్ని ఉపయోగించానని సరదాగా వ్యాఖ్యానించిన శివకుమార్ అనంతరం ఎమ్మెల్యేలు చేజారకుండా ఎలా జాగ్రత్తపడిందీ వివరించారు. బీజేపీ స్నేహితులు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని తెలిసింది. ఆపై నాకున్న వనరుల ద్వారా వారు ఎక్కడున్నారో కనిపెట్టాను. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడాను. వారిని బీజేపీ బలవంతం చేసిందనడంలో ఎలాంటి రహస్యం లేదు. బీజేపీ రాజకీయాలు చేసింది. మేమూ మా స్టయిల్ లో అవే రాజకీయ ఆటలు ఆడాం అని శివకుమార్ చెప్పుకొచ్చారు. అసలు బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును సుప్రీంకోర్టు 24 గంటలకు కుదించడంలోనే తమ విజయం ఖాయమైపోయిందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఇలా బీజేపీకి ఘోరపరాభవం మిగిల్చి, కాంగ్రెస్-జేడీఎస్ కు విజయాన్ని కట్టబెట్టిన శివకుమార్ ను హైకమాండ్ ప్రత్యేకంగా అభినందించింది. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శివకుమార్ నాయకత్వంలో కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని అధిష్టానం భావిస్తోంది. రెండు పర్యాయాలుగా పీసీపీ అధ్యక్షడిగా ఉన్న పరమేశ్వర్ కు కుమారస్వామి క్యాబినెట్ లో హోం, డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నందున,ఆయన స్థానంలో ఖాళీ అవుతున్న పీసీసీ అధ్యక్ష పీఠాన్ని శివకుమార్ తో భర్తీ చేయనున్నట్టు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవని కూడా ఇప్పించాలన్న యోచనలో ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ ను అడ్డుకున్న శివకుమార్ పై హైకమాండ్ బాగానే కృతజ్ఞత చూపిస్తోందన్నమాట.