Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ సింగ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంది. గుర్మీత్ ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్ల లో హనీప్రీత్ ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆమె విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా మౌనంగా ఉంటున్నట్టు సమాచారం. అరెస్టయ్యేముందు జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనీప్రీత్..అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని చెప్పుకొచ్చింది. అయితే అల్లర్ల వెనక హనీప్రీత్ హస్తం ఉందని పోలీసులకు ఆధారాలు లభించాయి. గుర్మీత్ వ్యక్తిగత సిబ్బందితో పాటు డ్రైవర్ రాకేశ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారని పోలీసులు తెలిపారు. అల్లర్లకోసం హనీప్రీత్ రూ. 1.25 కోట్లు ఖర్చుచేసిందని పోలీసులు తెలిపారు.
కోర్టు తీర్పుకు రెండురోజుల ముందు పంచకుల డేరా బ్రాంచ్ హెడ్ కు హనీప్రీత్ రూ. 1.25 కోట్లు ఇచ్చినట్టు విచారణలో తేలిందన్నారు. దీనికి సంబంధించి ఆన్ లైన్ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు 25న సీబీఐ కోర్టు గుర్మీత్ పై తుది తీర్పు ఇవ్వనుందని ముందే సమాచారం ఉండడంతో డేరా బాబా అనుచరులు, భక్తులు పంచకులకు భారీగా తరలివచ్చారు. కోర్టు బాబాను దోషిగా నిర్ధారించిన వెంటనే అక్కడ విధ్వంసం చెలరేగింది. తీర్పు సమయంలో బాబా దగ్గరే ఉన్న హనీప్రీత్ ఎర్రబ్యాగుతో అనుచరులకు సంకేతాలు ఇచ్చిందని, వెంటనే వారు విధ్వంసానికి దిగారని పోలీసుల విచారణలో తేలింది. బాబా అరెస్టు, అల్లర్ల తర్వాత హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లింది. 37 రోజులపాటు రహస్య జీవితం గడిపింది. ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన హనీప్రీత్ ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.