శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు వెలువర్చిన విషయం తెలిసిందే. అయితే దీన్ని పలు హిందూ సంఘాలతో పాటు ట్రావెన్ కోర్ బోర్డు కూడా వ్యతిరేకించింది. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు వాదనలు ముగిశాయి. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అయితే ముందు నుండీ ఆలయంలోకి మహిళల ప్రవేశం పట్ల రావడానికి వీల్లేదని వాదిస్తూ వచ్చిన ట్రావెన్కోర్ బోర్డు తాజాగా యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ విషయంలో సుప్రీం తీర్పును తాము పాటిస్తామని బోర్డు నేడు వెల్లడించింది.
తీర్పుపై ఎలాంటి రివ్యూ అవసరం లేదని కేరళ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు కూడా తన వైఖరి మార్చుకుని ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును పాటిస్తామని ఈరోజు న్యాయస్థానానికి వెల్లడించింది. ధర్మాసనంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా బోర్డు తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ రిట్ పిటిషన్లపై తీర్పు సందర్భంగా చేసిన వాదనలో మార్పు వచ్చిందా? అని అడిగారు. దీనిపై బోర్డు తరపు న్యాయవాది సమాధానం చెప్తూ తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించిందని దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసిందని ఆయన చెప్పారు. శబరిమల వివాదం రెండు వర్గాల మధ్య సమస్య కాదని ఒక మతానికి సంబంధించిన అంశమని బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది.