కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు…ఐదేళ్ళ జైలు శిక్ష

Inappropriate comments on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు  చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు  రూ.2వేలు జరిమానా కూడా వేసింది. నిందితుడు ఆకుతోట రామకృష్ణ  సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కుర్మగూడ మాదన్నపేట నూర్‌మజీద్ దగ్గర నివాసం ఉండే ఇబ్రహీం ఉల్‌హక్.. సీఎం కేసీఆర్‌కు అభిమాని. దీంతో ఇబ్రహీం సీసీఎస్‌లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్ ఐడీ, ఫోన్ నంబర్‌తో రామకృష్ణ చిరునామా కనుక్కొని ఈ నెల 17న అరెస్ట్‌చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రామకృష్ణకు గురువారం కోర్టు ఐదేండ్ల జైలుశిక్షతోపాటు 2 వేల రూపాయల జరిమానా విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడికి తగినశాస్తి జరిగిందని కేసు గెలిచిన ఇబ్రహీం హర్షం వ్యక్తంచేస్తూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతీఒక్కరికి ఇదో హెచ్చరికలాంటిదని అభిప్రాయపడ్డారు.