Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట శశికళ ఆస్తుల మీద దాడులు ఆశ్చర్యం కలిగించకపోయినా అందులో బయటపడుతున్న మొత్తాలు చూస్తే సామాన్యుడికే కాదు. మొత్తం అధికారాగాణానికి నోట మాట రావడం లేదు. ఇప్పటిదాకా శశికళ పరివారం కనుసన్నల్లో వున్న ఆస్తుల విలువ 30 వేల కోట్ల పై మాటే అని అంచనా. ఇంకా తవ్వి తీస్తే ఆ మొత్తం 50 వేల కోట్లకు కాస్త అటుఇటుగా ఉండొచ్చు. నిజానికి ఆ ధనం దోచుకున్నది ఒక్క శశికళ మాత్రమే అనుకుంటే పొరపాటే. తమిళ ప్రజలు అమ్మగా కొలిచే జయలలిత ప్రమేయం లేదా మద్దతు ఎంతోకొంత లేకుండా ఈ స్థాయిలో అవినీతి చేయడం కష్టం. సీఎం కి దగ్గరగా ఉంటే ఇంత అవినీతి చేస్తే, అసలు ఆ ముఖ్యమంత్రుల కుటుంబాలు అవినీతిలో పాలుపంచుకున్న చోట ఆ విలువ ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
శశికళ పరివారం మీద మోడీ సర్కార్ ఐటీ, ఈడీ ని ఉసిగొలపడం మీద ప్రజలకు ఏ అభ్యంతరాలు లేవు. అయితే ఇదంతా రాజకీయ కోణంలో మాత్రమే చేస్తున్నారన్న అభిప్రాయం జనాల్లో వుంది. ఆ అభిప్రాయాన్ని మార్చాలంటే ప్రధాని మోడీ ఓ పని చేయాలి. ఏ రాజకీయ అండ లేని శశికళ మీద మాత్రమే కాదు రాజకీయాలను ఓ ఆదాయ వనరుగా మార్చుకున్న కుటుంబాలు దాదాపు 10 వేలు భారత్ లో వున్నాయి. ఈ పదివేల కుటుంబాలను కదిలిస్తే, వాళ్ళ అవినీతి కోటగోడలు బద్దలు కొడితే లక్ష లక్షల కోట్ల ప్రజా ధనం బయటికి వచ్చే అవకాశం ఉందట. ఆ దెబ్బకు ఇండియా సంపన్నదేశం గా మారిపోవడమే కాదు. రాజకీయాల్లో అవినీతి మురికి వదిలిపోయి సరికొత్త భారతం ఆవిష్కృతం అవుతుంది. కానీ ఓ విషయం ఇదంతా ఓ సామాన్యుడి ఆశ, భ్రమ అని ఎప్పుడో అర్ధం అయ్యింది. మోడీ అధికారంలోకి వచ్చినా లక్షల కోట్ల నల్ల ధనం విదేశాల నుంచి వెనక్కి రానప్పుడే అది తెలిసిపోయింది. వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు దర్జాగా విదేశాలు పారిపోయినప్పుడే ఇంకా బలపడింది. అయినా ఇలా రాజకీయ కారణాలతో శశి లాంటి వాళ్ళు బలైపోయినప్పుడు మాత్రం రాజకీయ, పాలనాపరమైన స్వచ్ఛత కోసం ఇలా జరిగితే ఎంత బాగుండో అన్న ఆ ఆశ సామాన్యుడిలో మిణుకుమిణుకుమంటూనే వుంది.