దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన వరద కోరల్లో చిక్కుకున్న కేరళ కోసం యూఏఈ సహా విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది. కేరళ పునర్నిర్మాణం, బాధితులకు పునరావాసం కోసం మా వంతు సహాయం మేము చేస్తామని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించాయి. కానీ విదేశాలు ప్రకటించిన సాయం పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారిని అభినందిస్తున్నప్పటికే సొంత నిధులతోనే కేరళను పునర్నిర్మించాలని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే విదేశాల నుంచి వ్యక్తిగతంగా, ఏదైనా సంస్థ రూపంలో పంపిస్తున్న విరాళాలకు, విదేశాల్లో స్థిరపడిన కేరళ వాసులకు ప్రభుత్వం ఎలాంటి అడ్డూ చెప్పడంలేదు. యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కేరళకు రూ. 700 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. దీనికి ప్రధాని మోదీ ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా యూఏఈకి కృతజ్ఞతలు చెప్పారు. కానీ విదేశ ప్రభుత్వాల నుండి డబ్బు మాత్రం తీసుకోరని తెలుస్తోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశాల సాయం తీసుకోరాదని 2004 సునామీ సమయంలో భారత్ దీర్ఘకాలిక నిబందన ఒకటి అమలు పరచింది. ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం మన దేశానికి ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈ నిబందన కఠినంగా అమలు చేస్తున్నందునే తాజాగా విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్రం తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది. విదేశాల నుంచి సాయం తీసుకోమని తిరస్కరించడం మనకు కొత్తేమీ కాదు 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశాల సాయాన్ని తిరస్కరించింది.