Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాయి. లోక్ సభ స్థానాలకు అక్కడక్కడా జరిగిన ఉప ఎన్నికల పోరు కూడా ముగిసిపోయింది. ఇక ఇప్పుడు దేశరాజకీయాలన్నీ గుజరాత్ చుట్టూ తిరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత..అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నిక, ఇటీవల పంజాబ్ లోక్ సభ ఎన్నికలో గెలుపు తప్ప కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ విజయాలేవీ లేవు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నా. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంలానే ఉంది. మోడీ, అమిత్ షా వ్యూహాలకు కాంగ్రెస్ చిత్తవుతోంది.
మోడీలాంటి బలమైన నేతను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ పార్టీ సతమతమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ మోడీ ప్రాభవాన్ని ఎదుర్కోగలడని ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదు. అందుకే పార్టీతో పాటు.. దేశ ప్రజల్లోనూ సత్తా నిరూపించుకోటానికి రాహుల్ గాంధీకి ఓ విజయం కావాలి. కాంగ్రెస్ పని అయిపోయిందని వస్తున్న విమర్శలు, రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై తలెత్తుతున్న సందేహాలకు తెరపడాలంటే తిరుగులేని విజయం ఒకటి సాధించాలి. మోడీకి, బీజేపీకి పెట్టనికోట లాంటి గుజరాత్ లో ఆ విజయం సాధించగలిగితే… ఇక కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి ఎదురుండదు. అందుకే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పై కాంగ్రెస్ కన్నేసింది. రెండు దశాబ్దాల క్రితమే అధికారం కోల్పోయి..ఇన్నేళ్ల నుంచి నామమాత్రంగా రాష్ట్రంలో ఉనికి చాటుతున్న కాంగ్రెస్ ఈ సారి మాత్రం ఎన్నికల్లో గెలుపునే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రాహుల్ వీలుచిక్కినప్పుడల్లా గుజరాత్ ను తన మాటల్లో ప్రస్తావిస్తున్నారు. మోడీని విమర్శించడానికి గుజరాత్ అంశాలపైనే మాట్లాడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ పేదప్రజలకు మోడీ కలలను అమ్మేస్తున్నారని విమర్శించారు.
2028 నాటికి మోడీ ప్రతి గుజరాతీకి చంద్రునిపై ఇల్లు కట్టిస్తారని, 2030 నాటికయితే చంద్రుణ్నే భూమ్మీదకు తీసుకొస్తారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని గుజరాత్ పర్యటనకు వెళ్లే ముందు కూడా రాహుల్ వ్యంగాస్త్రాలు సంధించారు. వాతావరణ రిపోర్ట్ః గుజరాత్ లో ఇంకాసేపట్లో మాటల వర్షం కురుస్తుంది అంటూ మోడీని ఎద్దేవాచేస్తూ ట్వీట్ చేశారు. ఇక తన గుజరాత్ పర్యటనలో అయితే రాహుల్ తన వైఖరికి భిన్నంగా ప్రవర్తించారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తయినా…తల్లి సోనియాగాంధీ వల్ల క్రిస్టియన్ అన్న ముద్ర ఉన్న రాహుల్ గాంధీ అది తప్పని నిరూపించేందుకు ప్రయత్నించారు. గుజరాత్ పర్యటనలో ఆయన అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేయడం ఇందుకోసమే. అయితే రాహుల్ గాంధీ.. ముందు తాను హిందువు అని నిరూపించుకోవాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి వ్యూహాలను అప్పటికప్పుడు తిప్పికొట్టారు. అటు ప్రధానమంత్రి మోడీ కూడా కాంగ్రెస్ వ్యూహాలను గమనిస్తున్నారు. గుజరాత్ లో బీజేపీకి తిరుగులేని బలముండడంతో ఎన్నికల్లో తమదే గెలుపుని ఆయన ధీమాతో ఉన్నారు. అదే సమయంలో ఓటు బ్యాంకు చేజారి పోకుండా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంపై వరాల జల్లులు ప్రకటిస్తున్నారు.
56 ఏళ్ల నుంచి గుజరాత్ ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సర్దార్ సరోవర్ డ్యాంను ఇటీవలే ప్రారంభించిన మోడీ… రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలిగించే చర్యలు చేపడుతున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పై తన పదునైన మాటలతో విమర్శల దాడిచేస్తున్నారు. నిన్న రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని గుజరాత్ అన్నా, గుజరాతీయులు అన్నా నెహ్రూ గాంధీ కుటుంబానికి కంటగింపు అని ఆరోపించారు. అహ్మదాబాద్ లో నిర్వహించిన గుజరాత్ గౌరవ్ మహాసమ్మేళన్ లో ప్రసంగిచిన ఆయన కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు. గుజరాత్ అంటేనే వారికి పడదని, రాష్ట్రానికి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాలయ్ లాంటి అగ్రనేతలకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ కన్నా ముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తారని పేరుగాంచిన శశిథరూర్ ట్విట్టర్ లో ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. మోడీ చెప్పినట్టుగా కాంగ్రెస్ కు గుజరాతీలంటే ఏహ్యభావం లేదని శశిథరూర్ చెప్పారు. తన కొడుకు ఇటీవలే గుజరాతీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, మీ రాష్ట్రం, అక్కడి ప్రజలపై మాకు ప్రేమ తప్ప ఇంకేమీ లేదని ఆయన మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రధానికి మాత్రం ఒక్క సొంతరాష్ట్రం అంటేనే ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. మొత్తానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే దాకా ప్రధాన పార్టీల మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.