Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సహా 77 మంది విమాన ప్రయాణికులకు పెనుప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తిరుపతి నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టైరు పేలిపోయి… మంటలు ఎగిసాయి. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం రాత్రి 9.55 గంటలకు 77 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. శంషాబాద్ లో రాత్రి 10.30 గంటలకు రన్ వే పై ల్యాండవుతుండగా… ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విమానం టైర్ పేలిపోయింది. ఆ ధాటికి నిప్పురవ్వలు ఎగిసిపడడంతో మంటలు చెలరేగాయి. విమానం ముందుకు కదలకపోవడంతో పైలట్ రన్ వేపై నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తంచేశారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.
విమానం కుదుపులకు గురవడం, మంటలు అంటుకోవడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు ఆర్పిన తర్వాత కూడా చాలా సేపు విమానం తలుపులు తెరవలేదు. విమానం దగ్గరకు ఎవరినీ వెళ్లనీయలేదు. చివరకు పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదం వల్లే పెనుప్రమాదం తృటిలో తప్పిందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. శంషాబాద్ లో విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్ వే పై ఆగిపోయిందని తెలిపారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో అర్ధం కాక అందరం భయపడ్డామని, తానైతే విమానం పేలిపోతుందేమోనని అనుకున్నానని, మంటలు అదుపు చేశాక కూడా అరగంట వరకు విమానం డోర్లు తెరవకపోవడంతో ప్రయాణికులమంతా వణికిపోయామని రోజా వెల్లడించారు. ల్యాండయ్యే సమయంలో మంటలు చూసి భయపడిన ప్రయాణికులు విమానం నుంచి దిగాలని ప్రయత్నించినా… ఎయిర్ హోస్టెస్ వద్దని చెప్పడంతో ఆగిపోయారని తెలిపారు.