మోదీ హవాతో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆయనను పక్కన పెట్టేయనుందని, మోడీకి ప్రత్యామ్నాయం కోసం కూడా వెతుకుతోందని జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. 2014తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ మూటముల్లె సర్దుకోవడం ఖాయమని అంచనా వేస్తోంది. ప్రధాని అభ్యర్థిగా మోదీకి మద్దతు లేకపోతే, ఆయన స్థానంలో మరొకరిని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు, ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.
దీనికి పలు కారణాలు లేకపోలేదని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అదేసమయంలో త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ బీజేపీ తీరుపై ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉంది. వారం రోజుల క్రితం హర్యాణాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన బీజేపీ, ఆరెస్సెస్ నేతల మధ్య మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు వినికిడి.
అలాగే జమ్ముకశ్మీర్‌లోని మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వెనక కూడా ఆరెస్సెసే కారణంగా తెలుస్తోంది. పీడీపీతో పొత్తు వల్ల జమ్ముకశ్మీర్‌లోని హిందువుల్లో బీజేపీ పట్టు కోల్పోతోందని, మున్ముందు ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాగలదని ఆరెస్సెస్ భావించింది. ఈ విషయాలను బీజేపీ అధిష్ఠానానికి చెప్పడం వల్లే సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది. సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ నేతల సమావేశంలో జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై పెద్ద చర్చే జరిగిందని. వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని నేతలు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పీడీపీతో కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. గవర్నర్ పాలన ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే పీడీపీ నుంచి బీజేపీ బయటకు వచ్చినట్టు సమాచారం.