నిన్న భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో దేశంలో అంతా సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని వీడియోలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్ ఇలా జరిగిందంటూ కొందరు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐఏఎఫ్ నుంచి దాడికి సంబంధించిన వీడియోలేవీ అధికారికంగా విడుదల కాలేదు. ఈ వీడియోల్లో వాయుసేన గురి తప్పకుండా ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై దాడి చేస్తున్నట్లు ఉంది. ఉగ్రవాదులు పరుగులు పెట్టడం కూడా కనిపిస్తోంది.
ఈ వీడియోలను పరిశీలనగా గమనిస్తే అవి ఒరిజినల్ వీడియో కావని తెలిసింది. అందులోని దృశ్యాలు వీడియో గేమ్‌ను పోలినట్లే ఉన్నాయి. పైగా, వేగంగా దూసుకెళ్లే మిరాజ్ 2000 విమానాలు అంత నిలకడగా వీడియో తీసే వీలు లేదు. పైగా, ఆ వీడియోలో గన్‌తో కాల్పులు జరుపుతున్నట్లు కూడా ఉంది. అందులో తీవ్రవాదుల కదలికను నిశితంగా పరిశీలిస్తే అది వీడియో గేమ్ అని స్పష్టమవుతుంది. అది ‘ఆర్మ 2’ అనే వీడియో గేమ్‌కు సంబంధించిన వీడియో అని తేలింది. వాట్సాప్ ద్వారా షేరవ్వుతున్న ఈ వీడియోను అన్ని విధాలా పరిశీలిస్తే ఆ వీడియోను 2009లో విడుదలై ‘ఆర్మ 2’ వీడియో గేమ్ నుంచి తీసి, ఎడిట్ చేసి సర్జికల్ స్ట్రైక్ గా షేర్ చేశారని తెలిసింది.