వైఎస్ జగన్ ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టి నెల రోజులు గడిచింది. మే 30న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే ఇప్పటికే నెల రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అవినీతి రహిత పాలన, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మహిళల సంక్షేమం, గ్రామ స్వరాజ్యం.. ఇలా వివిధ రకాల పాలనాంశాల్లో తన మార్క్‌తో ముందుకు సాగుతున్నారు. అలా జగన్ నెల రోజుల పాలనలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటివో చూద్దాం..
- అమ్మఒడి పథకం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో అతిముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. పిల్లలను స్కూల్‌కు పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15,000 ఇస్తామని ప్రకటించారు. ఇటీవలే ఈ పథకాన్ని ఇంటర్ కాలేజీలకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.
- జగన్ ప్రమాణ స్వీకారం రోజు పెన్షన్ పెంపు మీద తొలి సంతకం చేశారు. రూ.2,000 పింఛన్‌ను రూ.2,250కి పెంచారు. దీన్ని ప్రతి ఏటా పెంచుతూ రూ.3,000కు తీసుకెళ్తారు.
- ఐదుగురు డిప్యూటీ సీఎంలతో దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. రెండున్నరేళ్ల తర్వాత రెండో దఫా కేబినెట్ ఉంటుందని చెప్పి సంచలనం తెరతీశారు.
- పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.
- గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి పెద్ద సంచలనానికి తెరతీశారు.
- వలసలను ప్రోత్సహించనని ప్రకటించి అందరి ప్రశంసలు పొందారు.
- అన్నదమ్ములు కలిసి ఉంటేనే బలం. ఈ దిశగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి రాష్ట్ర విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు జగన్.
- నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. గ్రామాల్లో ఉండే యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
- ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్లో ఇసుక విధానానికి శ్రీకారం చుట్టారు.
- ఉగాది కానుకగా అర్హులైన మహిళలకు 25 లక్షల ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
- రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
- రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు.
- మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్ నెలకు రూ.10,000కు పెంచారు.
- ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు ఆమోద ముద్ర వేశారు.
- గత ప్రభుత్వపు అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపారు. కేబినెట్ సబ్ కమిటీని నియమించేందుకు అంగీకారం తెలిపారు.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల రోజుల పాలన హిట్టా? ఫట్టా?.. జగన్మోహన్రెడ్డి పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలను కేవలం నెల రోజుల పాలన ప్రాతిపదికన చెప్పడం కుదరదు. ఏదో పాఠకుల తృప్తి కోసమే.
|
|
|