నేనే కాబోయే సీఎం అని దాదాపు తొమ్మిదేళ్లుగా నొక్కివక్కాణిస్తున్న వైసీపీ అధినేత జగన్ కి ఇంకా ఆ పీఠం ఎక్కే యోగం అయితే పట్టలేదు గానీ ఇంకా ఓ కొత్త సమస్య మొదలైనట్టుంది. తాను ఎందుకు సీఎం కావాలో చెబుతూ తరచుగా చంద్రబాబుని వయసు మళ్లినవాడిగా, తనను యువకుడిగా చూపించుకోడానికి జగన్ చాలా తాపత్రయపడడం చూసాం. ఇద్దరి మధ్య వయోభేదం వున్న మాట నిజమే అయినప్పటికీ జ్ఞాపకశక్తి విషయంలో మాత్రం జగన్ చెప్పేదానికి , వాస్తవానికి తేడా ఉన్నట్టుంది. దాదాపు 70 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు ప్రభుత్వ పరంగా , పార్టీ పరంగా గణాంకాలు ఏ కాగితం చూడకుండా గడగడా చెప్పేస్తున్నారు. కానీ జగన్ కి ఒక్క రోజులోనే ఉదయం ఏమి చెప్పారో సాయంత్రానికి మర్చిపోతున్నట్టుంది.
ఈడీ ఛార్జ్ షీట్ లో భారతి పేరు చేర్చారు అన్న సంగతి బయటకు రాగానే వైసీపీ అధినేత జగన్ ఎలా రియాక్ట్ అయ్యారో అంతా చూసారు. ట్విట్టర్ ద్వారా భారతి పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో ఉందని పచ్చ మీడియా పిచ్చిపిచ్చి ప్రచారం చేస్తోందని రెచ్చిపోయారు. అదే జగన్ గారు పాపం సాయంత్రానికి తాను ఉదయం ఏమి చెప్పానో మర్చిపోయినట్టున్నారు. అందుకే పొద్దున్న అన్న విషయం పట్టించుకోకుండా మీడియా కి భారతి విషయం ఎలా తెలిసిందంటూ శివాలెత్తారు.
ఈ కుట్రలోచంద్రబాబుతో పాటు కాంగ్రెస్ , బీజేపీ ని కూడా కలిపేశారు. ఓ పెద్ద బహిరంగ లేఖ జనానికి రాశారు. అయితే ఆయన ముందు చెప్పినట్టు భారతి మీద ఈడీ ఏ చర్యకు దిగపొతే ఈ ఉలిక్కిపాటు ఎందుకో ?. సరే బాబు తో కుమ్మక్కు అయ్యారని జగన్ గారు ప్రవచిస్తున్న బీజేపీ ఇప్పుడు టీడీపీ మీద ఒంటి కాలి మీద ఎందుకు లేస్తోందో ? ఇక విపక్షం లో వున్న కాంగ్రెస్ జగన్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టగలదో? ఈ ప్రశ్నలకు సమాధానాలు జగన్ దగ్గర దొరకడం కష్టమే. ఇవన్నీ చూస్తుంటే ఈ వయసులోనే జగన్ కి మతిమరుపుతో పాటు ప్రపంచమంతా తనను ఏదో చేయడానికి కుట్ర చేస్తోందన్న అనుమానం కూడా మొదలైనట్టుంది.