Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన పాదయాత్ర ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. నవంబర్ 6 నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరపాలని ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నారు జగన్. ఆ పాదయత్రకి మీడియా మద్దతు కోరుతూ రామోజీ లాంటి వాళ్ళు మొదలుకుని సామాన్య జర్నలిస్టులు దాకా అందరి మద్దతు కోరారు. ఇక జగన్ కి కుడి ఎడమ భుజాలుగా చెప్పుకునే విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాదయాత్ర కి సంబంధించిన రూట్ మ్యాప్, ఇంకా ఇతర ఏర్పాట్లలో తలమునకలు అయి వున్నారు. పరిస్థితి ఇక పాదయాత్ర మొదలు కావడమే తరువాయి అన్నట్టు వుంది. ఈ సమయంలో జగన్ పాదయత్రకి ఇంకో సమస్య వచ్చిపడింది.
జగన్ తన పాదయాత్ర కోసం ఎంచుకున్న నవంబర్ 6 ముహూర్తం పెద్దగా బాగా లేదని ఆయన శ్రేయోభిలాషులుగా చెప్పుకునే ఇద్దరు స్వామీజీలు అభిప్రాయపడ్డారట. వారు జగన్ సన్నిహితులకు ఈ విషయం చెప్పడమే కాకుండా ముహూర్త బలాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు కూడా చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 6 కాకుండా పాదయాత్ర ముహూర్తం మార్చాలని ఒత్తిడి చేస్తున్నారట. ఆ స్వామీజీల మాటలతో జగన్ అండ్ కో కాస్త కంగారు పడుతున్నప్పటికీ ఇంకో సారి పాదయాత్ర వాయిదా వేస్తే నలుగురిలో నవ్వుల పాలు అవుతామని సంకోచిస్తున్నారు. ఈ పరిస్థితి జగన్ కి బాగా ఇబ్బంది కలిగిస్తోందట. నవంబర్ 6 న పాదయాత్ర మొదలు పెడితే కలిసిరాదేమో అన్న భయం ఒకవైపు, పాదయాత్ర వాయిదా వేస్తే పరువు పోతుందన్న సంకటం ఇంకో వైపు… మొత్తానికి ఆ స్వామీజీలు ఇద్దరూ జగన్ కి కొత్త కష్టాలు తెచ్చిపెట్టారు.