Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయపార్టీలకు తెలుసని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు ఏదైనా…రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావడమే ముఖ్యమన్నారు. విభజన హామీలను కేంద్రప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందో తేల్చడం కోసం జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల బృందం తొలి సమావేశం ఇవాళ జరిగింది. హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియం సెమినార్ హాల్ లో జరిగిన ఈ సమావేశం అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అమలు సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చట్టపరంగానూ, పార్లమెంట్ లోనూ ఇచ్చిన హామీల్ని కేంద్రప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందీ తేల్చడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌరసమాజంగా వ్యవహరించడం వంటి అంశాలపై చర్చించినట్టు జేపీ తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జేపీ విమర్శలు చేశారు. సంయుక్త నిజనిర్దారణ కమిటీపై పవన్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. జేఎఫ్ సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని జేపీ తెలిపారు. జేఎఫ్ సీ తొలిదశ అయితే, స్వతంత్ర నిపుణుల కమిటీ రెండోదశని చెప్పారు. కేంద్రప్రభుత్వం సమయం ఇస్తే..తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని జేపీ వ్యాఖ్యానించారు. నిపుణుల బృందం సమావేశంలో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, రైతుల సమాఖ్య సంఘ సెక్రటరీ జనరల్ చెంగల్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఐపీఎస్ అధికారులు,ప్రొఫెసర్లు, ఆర్థిక, న్యాయ రంగాల నిపుణులు పాల్గొన్నారు.