Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి మూడు నెలలు దాటింది. అయినప్పటికీ ఆమె పెద్ద కూతురు జాన్వి ఆ చేదు జ్ఞాపకం నుంచి బయటపడలేకపోతోంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతున్న జాన్వి తల్లి లేకుండా తన జీవితం ఎలా గడుస్తోందో ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. ధడక్ ప్రచార కార్యక్రమంలో భాగంగా జాన్వి వోగ్ కు ఫొటో షూట్ ఇచ్చి, తొలి ఇంటర్వ్యూలో మాట్లాడింది. అమ్మ వెళ్లిపోయాక కుటుంబమంతా ఒక్కటయిందని, దాంతో ఇప్పుడు తమకు ఓ భరోసా దొరికినట్టు అనిపిస్తోందని జాన్వి వ్యాఖ్యానించింది.
అన్నయ్య అర్జున్ కపూర్, అక్క అన్షులా కపూర్ తమను సొంత తోబుట్టువుల్లా చూసుకుంటున్నారని, అయినప్పటికీ అమ్మలేని లోటు తమ జీవితాల్లో ఎప్పటికీ తీరదని జాన్వి తెలిపింది. తనకు ఇలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు గర్వంగా ఉందని, కాబట్టి తాను కూడా వాళ్లను గర్వపడేలా చేయాలన్న ఆలోచనే తనను ముందుకు నడిపిస్తోందని చెప్పింది. మనం ఏ సినిమాలో చేస్తున్నాం… ఎలాంటి పాత్రను ఎంచుకున్నాం… అన్నది ముఖ్యం కాదని, మనం ఇచ్చిన ప్రదర్శనతో ఇతరులను మెప్పించామా లేదా అన్నదే ముఖ్యమని, అమ్మ తనకు ఇదే చెప్పిందని జాన్వి గుర్తుచేసుకుంది. ఇతరులను చూసి కుళ్లుకోవడం, విసుక్కోవడం వంటివి చేయొద్దని అమ్మ తనకు చెప్తుండేదని, నిజం చెప్పాలంటే ఆమెకు తాను నటిని అవ్వడం ఇష్టం లేదని, తన చెల్లెలు ఖుషికి మాత్రం ఇలాంటి నిబంధనలేవీ లేవని తెలిపింది.
తల్లిదండ్రులతో కలిసి ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్తుండడం వల్ల స్కూళ్లో తనకు 30 శాతమే అటెండెన్స్ ఉండేదని చెప్పింది. తనకు హిస్టరీ, ఇంగ్లీష్ లో మంచి మార్కులు వచ్చేవని, మిగతా సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చేవని, స్కూల్ పూర్తయ్యాక ఆర్ట్ హిస్టరీ, ఫ్యాషన్, యాక్టింగ్ పై దృష్టిపెట్టానని తెలిపింది. అమ్మ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చిందని, తన చిన్ననాటి సినిమాల గురించి కథలుగా చెప్పేదని, 80,90ల కాలంలో పనిచేసే ఇతర నటీనటులు మాదిరిగానే అమ్మ కూడా వివిధ షిఫ్ట్ ల్లో పనిచేసేదని జాన్ని చెప్పింది. తన ఫ్యాషన్ కు సంబంధించి అన్నీ అమ్మే చూసుకునేదని, ఉదయం లేవగానే ఏం వేసుకోవాలని అమ్మనే అడిగేదాన్నని… కానీ ఇప్పుడు సలహాలిచ్చేవారు లేరని ఆవేదన వ్యక్తంచేసింది.
శ్రీదేవి దుబాయ్ వెళ్లే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో కూడా జాన్వి వివరించింది. పెళ్లి కోసం అమ్మానాన్నలు దుబాయ్ వెళ్తున్నప్పుడు తాను షూటింగ్ లో ఉన్నానని, రాత్రి నిద్రపట్టలేదని, దాంతో అమ్మను నిద్రపుచ్చమని అడిగానని జాన్వి తెలిపింది. అప్పటికే అమ్మ ప్యాకింగ్ చేసుకుంటూ ఉందని, ప్యాకింగ్ పూర్తయ్యేటప్పటికీ తాను సగం నిద్రలో ఉన్నానని, అప్పుడు అమ్మ పక్కనే ఉండి తల నిమురుతోందని ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంది. ఇప్పుడు అమ్మ లేకపోవడంతో ఖుషి తనను నిద్రపుచ్చుతోందని తెలిపింది. తాను నటించిన ధడక్ లోని 25 నిమిషాల సినిమాను అమ్మ చూసిందని జాన్వి తెలిపింది. గతంలో తల్లితో కలిసి చాలా ఫొటో షూట్లలో పాల్గొన్న జాన్వి తల్లి లేకుండా వోగ్ మ్యాగజైన్ కు తొలి ఫొటో షూట్ ఇచ్చింది. అనుభవం ఉన్న నటిలాగా జాన్వి ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.