Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనంతపురం రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ చక్రం తిప్పుతున్నారు. జిల్లా సంగతి పక్కనపెడితే తాడిపత్రి వారి అడ్డాగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి అయినా తాడిపత్రిలో మాత్రం జేసీ బ్రదర్సే ప్రభువులు అన్నంత రేంజ్ లో అధికారం వెలగబెట్టారు. గత కొన్నేళ్లుగా ప్రభ కోల్పోయిన జేసీ బ్రదర్స్.. వచ్చే ఎన్నికల్లో వారసుల్ని దింపి తమ క్యాడర్లో జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు.
ముందుగా వారసుడ్ని తయారుచేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి.. తన తనయుడు పవన్ కోసం నియోజకవర్గం కూడా వెతికేశారు. అటు పవన్ కూడా తండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఏడు అసెంబ్లీ స్థానాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు, ముస్లింలకు ఇఫ్తార్ విందులు అంటూ బిజీగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అనంత రూరల్ ను ఎంచుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక జేసీ తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి కొడుకును బరిలోకి దించుతారట. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ కౌన్సిలర్ గా అరంగేట్రం చేసేశారు. రాజకీయ ప్రత్యర్థుల్ని మూడు చెరువుల నీళ్లు తాగించిన జేసీ బ్రదర్స్ తరహాలో.. ఈ జూనియర్స్ కూడా రాజకీయాలు చేస్తారా.. లేదంటే త్వరలోనే తెరమరుగవుతారా అనేది వేచి చూడాల్సిందే.