ఎన్టీఆర్ ఇటీవలే రెండవ కొడుకుకు తండ్రి అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి రెండవ సారి కూడా కొడుకుకు జన్మనివ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మొదట కొడుకు అవ్వడంతో రెండవ సంతానంగా కూతురు కావాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు. కాని అన్ని అనుకున్నట్లుగా జరగవు కదా, ఎన్టీఆర్ కోరుకున్న కూతురు కాకుండా మళ్లీ కొడుకు జన్మించాడు. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం లేకుండా ఎన్టీఆర్ సంతోషంగా ఇద్దరు కొడుకులతో ప్రతి రోజును ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన చిన్న కొడుకుకు నామకరణం చేశాడు. చిన్న కొడుకు పేరును తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. మొదటి కొడుకుకు అభయ్ రామ్ అని పెట్టుకున్న ఎన్టీఆర్ రెండవ కొడుకుకు భార్గవ రామ్ అని నామకరణం చేసినట్లుగా ఎన్టీఆర్ ప్రకటించాడు. ఆరోజుల్లో బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్. అప్పట్లో ఈ చిత్రం బాలయ్యకి భారీ విజయాన్ని అందించింది.
అలాంటి బాబాయ్ సినిమా పేరు కూడా కలిసేలా పేరు పెట్టడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో తన చిన్న కొడుకును ఎత్తుకున్న ఈ క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇద్దరు కొడుకులతో పాటు, భార్యతో చాలా ఆనందంగా ఎన్టీఆర్ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. ఇక సినీ కెరీర్ పరంగా కూడా ఎన్టీఆర్ చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. రామ్ చరణ్‌తో కలిసి చేయబోతున్న ఆ మల్టీస్టారర్ చిత్రం డిసెంబర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. 2020వ సంవత్సరంలో ఆ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.