Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారా… రారా…వస్తే ఏదన్నా పార్టీలో చేరతారా లేక సొంత పార్టీ పెట్టుకుంటారా…ఇప్పుడు తమిళ రాజకీయాల్లో వాడివేడిగా సాగుతున్న చర్చ ఇదే. రాజకీయ రంగ ప్రవేశంపై కమల్ పరోక్ష సంకేతాలు ఇస్తుండటంతో …ఆయన కార్యాచరణపై తమిళనాడు ప్రజలు దృష్టిపెట్టారు. జయలలిత మరణం తరువాత అనిశ్చితిగా సాగుతున్న రాజకీయాలు ఆ రాష్ట్రంలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకె చీలిక వర్గాల మధ్య ఐక్యత కోసం ఓ పక్క చర్చలు జరుగుతుండగా…మరో పక్క కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలొస్తున్నాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన వర్గాలు చెబుతున్నాయి కానీ…ప్రత్యక్షంగా ఆయనెక్కడా వ్యాఖ్యానించలేదు. అలాగే ప్రస్తుత రాజకీయాలను ఉద్దేశించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయటం లేదు. కానీ కమల్ హాసన్ కు మాత్రం రాజకీయాలే వ్యాపకమయినట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ట్వీట్లన్నీ రాజకీయాలకు సంబంధించినవే…సినిమాల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కాబట్టి కమల్ రాజకీయ రంగం ప్రవేశం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆయన ప్రస్తుతమున్న పార్టీల్లో చేరతారా లేక కొత్త పార్టీ ప్రారంభిస్తారా అన్నదే తమిళ ప్రజలకు అర్ధం కావటం లేదు.
అవినీతి గురించి కమల్ వ్యాఖ్యానించటం, రాష్ట్రంలో పాతుకుపోయిన అన్నాడీఎంకె, డీఎంకెలు మొద్దుబారిన పరికరాలని, ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఘాటైన విమర్శలకు దిగటం చూస్తే..ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంట్లో కమల్ చేరే అవకాశం లేదని స్పష్టమయింది. అధికార, ప్రతిపక్షాలు రెండూ బలహీనంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కమల్ కొత్త పార్టీ పెడితే…ప్రజాదరణ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో రజనీకాంత్ కూడా రంగప్రవేశం చేస్తే..సినిమాల్లోలానే… రాజకీయాల్లోనూ ఇక వారిద్దరి మధ్య వైరం సాగే అవకాశముందని భావిస్తున్నారు. కమల్, రజనీలిద్దరూ ఒకే పార్టీలో చేరే అవకాశం లేదు కాబట్టి.. వారిద్దరి మధ్య పోటీ తప్పదని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు తమిళనాడును బలోపేతం చేయటమే ధ్యేయమని, తన ధ్యేయాన్ని బలోపేతం చేసే సాహసం ఎవరు చేస్తారో చూడాలని కమల్ చేసిన వ్యాఖ్యలు తరువాత అన్నాడీఎంకె అమ్మ వర్గం కీలక నేత, మాజీ మంత్రి కె. పాండ్యరాజన్ స్పందించారు. తమిళనాడు ప్రజల అభ్యున్నతే నిజంగా కమల్ కోరుకుంటున్నట్టయితే..ఆయన తమ వర్గానికే మద్దతిస్తారని, తాము చేస్తున్న ధర్మయుద్ధానికి బాసటగా నిలుస్తారని పాండ్యరాజన్ అన్నారు. మరి ఆయన కోరుకుంటున్నట్టు కమల్ అన్నాడీఎంకె చీలిక వర్గానికి మద్దతిస్తారా లేక కొత్త పార్టీ పెట్టుకుంటారా అన్నది తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
మరిన్ని వార్తలు: