Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాల్లో కాలుమోపడానికి సర్వసన్నద్ధం అవుతున్న కమల్ హాసన్ కి పాలిట్రిక్స్ బాగానే అలవాటు అయినట్టు వున్నాయి. పార్టీ ప్రకటన చేయకముందే గతంలో చేసిన తప్పుల్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నారు. తమిళ రాజకీయాల్లో బీజేపీ పాత్రని తీవ్రంగా తప్పుబడుతున్న కమల్ గతంలో ప్రధాని తీసుకున్న ఓ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారు. అదే పెద్ద నోట్ల రద్దు. పెద్ద నోట్ల రద్దు గురించి మోడీ ప్రకటించినప్పుడు దాని వల్ల పేదలకి మేలు జరుగుతుందని, దేశానికి మేలు జరుగుతుందని కమల్ భావించారు. తన అభిప్రాయాన్ని బయటికి చెప్పడంతో పాటు నోట్ల రద్దుని తప్పు పట్టిన వాళ్ళ మీద విరుచుకుపడ్డారు.
గతంలో తాను చేసిన తప్పు మున్ముందు తన రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండేందుకు గాను కమల్ ముందుగానే ఆ విషయాన్ని తానే ప్రస్తావించారు. మోడీ రాజకీయ స్వార్ధం కోసం చేసిన పెద్ద నోట్ల రద్దు ఎత్తుగడని అర్ధం చేసుకోకుండా సమర్ధించి తప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. మోడీ నిర్ణయం వల్ల పేదవారికి మేలు జరుగుతుంది అనుకుంటే వాళ్ళే ఇబ్బంది పడి ధనికులు లబ్ది పొందారని కమల్ ఆవేదన చెందారు. మొత్తానికి కమల్ రాజకీయాల్లో కి వచ్చే ముందే పాత తప్పుల్ని కడిగేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం, చొరవ ఆసక్తి రేకెత్తిస్తోంది.