Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త శకం మొదలయింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఈ ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం వేదికగా ఆయన తొలి అడుగు వేశారు. కలాంకు నివాళులర్పించిన తరువాత ఆయన కుటుంబసభ్యులతో కమల్ భేటీ అయ్యారు. కలాం సోదరుడు మహమ్మద్ ముతుమీర లెబ్బాయ్ కు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని…కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని కమల్ హాసన్ అన్నారు. సాయంత్రం ఆరుగంటలకు మధురైలో నిర్వహించే భారీ బహిరంగసభలో పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కమల్ సభకు జాతీయ మీడియా తరలివస్తోంది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ఇప్పటికే మధురై చేరుకున్నారు. కమల్ పార్టీపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సహజంగా నాస్తికుడయిన కమల్ హాసన్…కాషాయదళానికి వ్యతిరేక రాజకీయం నడిపించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తర్వాత…కమల్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులతోనే సమావేశం కావడం ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.