Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మక్కల్ నీది మయ్యమ్ స్థాపించి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన విఖ్యాత నటుడు కమల్ హాసన్ కు, మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి రాబోతున్న రజనీకాంత్ కు మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. సినిమాల్లో స్నేహితులైన వీరిద్దరూ రాజకీయాల్లోనూ అలాంటి స్నేహమే కొనసాగిస్తారా… లేక ప్రత్యర్థులుగా మారుతారా అన్నది అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం. తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ కు రాసిన ఓ వ్యాసంలో దీనిపై స్పష్టతనిచ్చారు కమల్. రాజకీయాల్లోకి రావడానికి ముందు తాను రజనీకాంత్ తో రహస్యంగా సమావేశమయ్యానని కమల్ వెల్లడించారు. ఓ కారులో జరిగిన ఈ సమావేశంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాలనేదానిపై తామిద్దరూ చర్చించుకున్నామని తెలిపారు.
తాను హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షూటింగ్ పూనమల్లెలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో జరుగుతుండగా, అక్కడికి సమీపంలో రజనీకాంత్ కాలా సినిమా షూటింగ్ జరుగుతోందని, అప్పుడే వెళ్లి రజనీని కలిశానని కమల్ తెలిపారు. మనం రహస్యంగా మాట్లాడుకుందామా… అని రజనీని అడిగానన్నారు. ఇద్దరం కలిసి కారులో కూర్చుని మాట్లాడుకున్నామని, రాజకీయాల్లోకి రావాలనుకున్న తన నిర్ణయాన్ని చెప్పానని కమల్ వెల్లడించారు. కమల్ నిర్ణయం విని రజనీకాంత్ ఆశ్చర్యపోగా…. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు మానసికంగా సిద్దమయ్యానని, ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని రజనీకాంత్ చెప్పగా… దానిపై స్పందించిన కమల్ భవిష్యత్తులో ఇద్దరం ప్రత్యర్థులుగా మారినా హుందాగా వ్యవహరించాలని ఆయనతో అన్నారు.






