Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లోకి వస్తారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ…తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరుగుతున్న కుట్రలు ఇక చాలునని కమల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయటమే తన ధ్యేయమని, తన ధ్యేయాన్ని బలోపేతం చేసే ధైర్యం ఎవరికుందని ట్విట్టర్ వేదికగా కమల్ ప్రశ్నించారు. అధికార అన్నాడీఎంకె, ప్రతిపక్ష డీఎంకె పైనా ఆయన ఘాటు విమర్శలు చేశారు. అన్నాడీఎంకె, డీఎంకె లాంటి పార్టీలు కేవలం పరికరాలు మాత్రమేనన్న ఆయన అవి మొద్దుబారిపోయినప్పుడు వేరొకరి సాయం తీసుకోవాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.
ప్రమాదాలు జరిగాయని, ప్రభుత్వంలో అవినీతి ఉందని ఆరోపిస్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నారని, మరి తమిళనాడులో రాజీనామాలు ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కమల్ ట్వీట్లు ఇప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలోనూ కమల్ రాజకీయాలపై కొన్ని ట్వీట్లు చేసినా..ప్రధాన పార్టీలపై నేరుగా విమర్శలు దిగటం ఇదే తొలిసారి. కమల్ డీఎంకెలోనో, అన్నాడీఎంకెలోనో చేరతారన్న ఊహాగానాలకు ఈ విమర్శల ద్వారా గుడ్ బై చెప్పారు. మరి విజయ్ కాంత్ లాగా కొత్త పార్టీ పెడతారా లేక రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే కమల్ భావజాలానికి, బీజేపీ సిద్దాంతాలకు ఎంతో వైరుధ్యం ఉంది.
కమల్ నాస్తికుడు. దేవుడు లేడన్న భావాలతో ఉంటారు. మరి బీజేపీతో ఆయనకు పొసగటం కష్టం. ఇక మిగిలింది కాంగ్రెస్…దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌తో కమల్ కలిసే అవకాశం లేదు. అందుకే ఆయన కొత్త పార్టీ పెడతారన్న వార్తలొస్తున్నాయి. తమిళనాడు వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో …కేంద్రాన్ని ఉద్దేశించే ఆయన తమిళనాడులో జరుగుతున్న కుట్రలు చాలు అని వ్యాఖ్యానించారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి సుదీర్ఘ సినిమా కెరీర్ ముగింపు కు చేరుకోవటంతో కమల్ ఇక రాజకీయాల బాట పట్టటం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: