ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోల్డ్ వార్ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలను లైం లైట్ లోకి తెచ్చినట్టియింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఈ ఇద్దరికీ ఈ దెబ్బతో కావాల్సినంత ప్రచారం లభిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయాణం మొదలెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ మాత్రం ఆయనకే దెబ్బేసే పరిస్థితి నెలకొంది. చంద్రబాబుని విమర్శించే ఊపులో ఓ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ అసలు హైదరాబాద్‌లో ఐటీకి పునాదులు వేసింది మాజీ పీఎం రాహుల్‌గాంధీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని వ్యాఖ్యానించటం పలు చర్చలకు దారి తీసింది.
ఎందుకంటే నిజానికి ఈ రోజు తెలంగాణలో ఐటీ పరిశ్రమ రాజ్యమేలుతుందంటే దానికి కారణం చంద్రబాబు. ఈ విషయం హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఐటీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని గుర్తించేలా ఒక కేరాఫ్‌గా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నాడు మైక్రోసాఫ్ట్ అధినేత, ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌ని ఒప్పించి ఆ కంపెనీని హైదరాబాద్‌కి రప్పించిన ఘనత బాబుది. ఈ సంగతి మనం చెప్పటం కాదు మైక్రో సాఫ్ట్ సీఈవో హైదరాబాద్ పర్యటనలో స్వయంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ స్వయంగా ఐటీ ఉద్యోగిగా పనిచేసి వచ్చారు. ఆయన అమెరికాలో మాస్టర్స్ చదివింది కూడా ఐటీలోనే. హైదరాబాద్ ఐటీ గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. హైదరాబాద్ సైబరాబాద్ గా మారిందంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చేసిన కృషేనని కూడా ఆయన చెప్పారు.
నాడు హైటెక్‌సిటీతో చంద్రబాబు నాయుడు వేసిన విజన్ నేడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలుగా విస్తరించి ఇవ్వాళ తెలంగాణకు సంవత్సరానికి సుమారు 60 వేల కోట్లరూపాయల మేర ఆదాయం సమకూరేలా చేస్తోంది. ఈ ఆదాయంతోనే కేసీఆర్ చేస్తున్న అనేక పథకాలకు ఆర్ధిక వనరుగా మారిందన్నది ఆర్ధిక నిపుణులు సైతం అంగీకరిస్తున్న వాస్తవం. అలాంటిది.. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ఓ ఆధారం లేకుండా కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం హాట్‌టాపిక్ అవుతోంది.