తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ముందస్తు ఎన్నికలు ఖాయమనేలా ఉన్నాయి. ప్రగతి నివేదన సభ అనుకున్నంత జోష్ ఇవ్వకపోవడంతో ముందస్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రగతి నివేదనను మరపించేలా సభలు నిర్వహించాలని టీఆరెస్ ప్లాన్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ సభల బాద్యతలు అన్నీ మేనల్లుడు హరీష్ రావుకు, మంత్రి ఈటెల కి అప్పచెప్పారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన నున్నారు. దాని ముందు రోజు అసెంబ్లీ రద్దు చేస్తారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఆ సభ మీద ఆసక్తి నెలకొంది. ఈ సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న బహిరంగ సభ పేరు ప్రజల ఆశీర్వాద సభ అని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తున్నామని నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇన్ని సభలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రగతి నివేదన సభకు ప్రజల నుంచి ఊహించని మద్దతు వచ్చిందని ఈ సభలు కూడా అంతకు మించి విజయవంతం అవుతాయన్నారు. అలాగే జాతకాలను, ముహూర్తాలను బాగా నమ్మే కేసీఆర్ జ్యోతిష్యుల సూచన మేరకే శ్రావణ మాసంలో తొలి బహిరంగ సభ ప్రారంభించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వాస్తు కూడా చూసుకుని తెలంగాణాకు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ ను తొలి సభకు ఎంపిక చేశారని వార్తలు అందుతున్నాయి. ఒక సభ పెద్ద ఝలక్ ఇవ్వడంతో వీటిని అయినా దగ్గరుండి ప్లాన్ చేయిస్తున్నారు కేసీఆర్.