ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో కొడంగల్ లో నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని రేవంత్ రెడ్డి కి కేటీఆర్ సవాల్ విసిరారు. తాజాగా కేటీఆర్ సవాల్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్ నడిబొడ్డుకు వచ్చి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా, కొడంగల్‌లో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి నేను గెలిస్తే కేటీఆర్ కూడా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. నేను గెలుపు పత్రాన్ని స్వీకరించిన మరుక్షణమే కేటీఆర్ రాజకీయ సన్యాస ప్రకటన చేయాలి. లేకపోతే కేటీఆర్‌ది కల్వకుంట్ల వంశమే కాదని తెలంగాణ సమాజం భావించాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆసలు ముందే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ 100 స్థానాల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించాడని, టీఆర్‌ఎస్ 99 స్థానాల్లోనే గెలిచిందని గుర్తుచేశారు. 2014లో 69శాతం ఓటింగ్‌తో ప్రజలు కేసీఆర్‌ను గద్దెనెక్కిస్తే ఇప్పుడు 73 శాతం పోలింగ్‌తో గద్దె దించుతున్నారని ఆయన అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకులని భావించిన 20లక్షల మంది ఓటు హక్కును తొలగించారని, ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి ఈసీని డిమాండ్ చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్‌కే రెండు చోట్ల ఓట్లు ఉన్నా కమిషన్ గుర్తించలేకపోయిందని ఆయన ఆరోపించారు. ‘సిద్దిపేటలోని సొంత గ్రామం చింతమడకలో ‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తండ్రి: రాఘవరావు’ పేరుతో మొదటి ఓటు, గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ‘చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి :రాఘవరావు కల్వకుంట్ల’ పేరుతో రెండో ఓటును కలిగి ఉన్నారని ఆధారాలు చూపారు. డిక్లరేషన్ ఫామ్-6 లోనూ రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు కేసీఆర్ ధ్రువీకరించలేదని, ఈసీని తప్పుదోవ పట్టించినందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 సెక్షన్ 37 ప్రకారం కేసీఆర్‌కు ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధించాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించలేకపోయినందుకు సీఈవో రజత్ కుమార్ క్షమాపణ చెబితే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కేటీఆర్ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.