తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా ఆ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. 119 స్థానాలకుగానూ 88 చోట్ల విజయం సాధించి, ప్రతిపక్షాలను చిత్తు చేసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే వరుసగా రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్‌తో పాటు డిప్యూటి సీఎంగా మహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాత కొద్దిరోజులకే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన మాత్రం రాష్ట్ర అవసరాల కంటే వ్యక్తిగత మైలేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం కంటే కేటీఆర్‌దే అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నికల ఫలితాలు రావడం సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఓ టాస్క్ అయిపోయిందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ఫైలుపైనా సంతకం చేయని గులాబీ అధినేత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అంటూ పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీని సమావేశ పరచకపోవడం విశ్లేశకులని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు లేవు, కేబినెట్ ఏర్పాటు కాలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లేరు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా మొత్తుకుంటున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అసలు భారీ మెజారిటీతో గెలిపించిన తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ రైతు రుణ మాఫీపైన ఆయా ముఖ్యమంత్రులు తొలి సంతకం చేశారు. కేసీఆర్ మాత్రం కొడుక్కి పదవి కట్టబెట్టేందుకు సంతకం చేశారు. కేసీఆర్ ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు ఇక నేటి నుండి హస్తినలో ఉంది మూడు రోజుల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారట !