తెలంగాణాలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకి సమయం సమీపిస్తుండడంతో బరిలోకి దిగిన రాజకీయ పార్టీల ప్రచారాలలోని పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతుంది. అటు ప్రజకూటమి, ఇటు తెరాస పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి క్రిందమీద పడుతున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు అంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ, ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళవలసిందో గల కారణం మరోసారి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విమర్శలు చేస్తూ, అడుగడుగునా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో, తమ మీద ప్రజలకున్న అభిమానం మరియు నమ్మకాలే సాక్షిగా మళ్ళీ అధికారంలోకి వచ్చి, ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలను నెరవేర్చాలనే తలంపుతోనే అసెంబ్లీ ని రద్దు చేసి, ముందస్తు కి వెళ్ళమని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ కారణం తో ప్రజలు ఎంతవరకు ఏకీభవిస్తారో తెలియదుగానీ, కేసీఆర్ మాత్రం తన మాటల గారడీ తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తన ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ని విమర్శిస్తూ, గడిచిన 58 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు తెలుగు దేశం దొరలు తెలంగాణ ప్రాంతానికి ఎంతటి అన్యాయం చేశారో అందరికి తెలిసిన విషయమేనని, తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో జరిగిన అభివృద్ధి ఎలావుందో ప్రజలు గమనిస్తున్నారని, వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని, ఆ ఘనతని సాధించింది తెరాస ప్రభుత్వం అని కేసీఆర్ ప్రజలకు వివరించారు. రైతులు తమ పంటలకి పెట్టుబడి సాయం కూడా తెరాస ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందిస్తుందని, తెలంగాణ ప్రజల మేలే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ, కేసీఆర్ ప్రసంగంలో ఇదివరకటి దూకుడు కనిపించకపోగా, ఆ స్థానంలో శాంతం, సౌమ్యం వచ్చి చేరడంతో సభకు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయినప్పటికీ తన గెలుపు పై ధీమా కేసీఆర్ తన మాటల్లో వెల్లడిస్తున్నారు. డిసెంబర్ 11 వరకు ఆగితే అర్ధం అవుతుంది ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో అనే విషయం.