Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫ్రంట్ కు మద్దతు కూడగట్టుకునేందుకు చెన్నైలో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా డీఎంకె అధినేత కరుణానిధి నివాసానికి చేరుకున్న కేసీఆర్ కు డీఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్వాగతం పలికారు. కరుణానిధి నివాసంలో ఆయనతో భేటీ అయిన కేసీఆర్ జాతీయ రాజకీయ పరిణామాల గురించి ఆయనతో చర్చించారు. కరుణానిధి ఆరోగ్యం గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా కరుణానిధి కేసీఆర్ కు కొన్ని పుస్తకాలు బహూకరించారు. తర్వాత స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్…అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తన బ్రదర్ స్టాలిన్ ను కలవడానికి చెన్నై వచ్చానని తెలిపారు. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై చర్చించానని చెప్పారు. దేశంలో గుణాత్మకమార్పు రావాల్సి ఉందని, రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై ఇటీవల మమతాబెనర్జీతో చర్చించినట్టుగానే స్టాలిన్ తోనూ చర్చలు జరిపానని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు, పట్టణ, గ్రామీణాభివృద్ధి వంటి అనేక సమస్యలను కేంద్రప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని, వీటన్నింటిపై తాము చర్చించామని, ప్రస్తుతం దేశ పరిస్థితులు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని విమర్శించారు.
తమ ఫ్రంట్ పై 2,3 నెలల చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోన్న ఈ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసిరావాలని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నామని, రైతులకు ఎకరాకు రూ. 8వేలు చొప్పున పంటసాయం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్ ను ఆహ్వానించామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి టీడీపీతో చర్చించడంపైనా కేసీఆర్ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,తానూ బెస్ట్ ఫ్రెండ్స్ అని, తామిద్దరం కలిసి గతంలో ఏడేళ్లు పనిచేశామని,తమ ఫ్రంట్ పై చంద్రబాబుతో కూడా త్వరలో చర్చిస్తామని కేసీఆర్ వెల్లడించారు. చెన్నై పర్యటనలో కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్ ఉన్నారు.