Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళలో నిపా వైరస్ సోకిన వారికి సేవ చేస్తూ మరణించిన నర్సు లిని చనిపోయే ముందు భర్తకు రాసిన లేఖ కేరళ ముఖ్యమంత్రిని కదిలించి వేసింది. లిని సేవకు మెచ్చిన ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. లిని కుటుంబానికి రూ. 20లక్షల పరిహారం ప్రకటించడమే కాకుండా ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. కోజికోడ్ లో నర్సుగా పనిచేస్తున్న లిని నిపా వైరస్ బారిన పడిన రోగులకు సేవ చేస్తుండగా… ఆమెకూ ఈ వైరస్ సోకింది. ప్రమాదకర వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న విషయం గ్రహించిన లినీ మరణించే ముందు బహ్రెయిన్ లో పనిచేస్తున్న భర్తకు లేఖరాసింది.
ఇవే నాకు చివరిక్షణాలు… ఇక మిమ్మల్ని చూస్తాననే ఆశ నాకు లేదు. క్షమించండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని మీతో గల్ఫ్ కు తీసుకెళ్లండి… అంటూ ఆమె రాసిన లేఖను కేరళ పర్యావరణ మంత్రి ఫేస్ బుక్ లో షేర్ చేయగా… అదినెట్ లో వైరల్ గా మారింది. అంతిమక్షణాల్లో లిని తీసుకున్న ఓ కఠిననిర్ణయంపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. నిపా వైరస్ ఒకరినుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉండడంతో తన మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు సైతం ఆమె ఒప్పుకోలేదు. దహనసంస్కారాలను కూడా కుటుంబసభ్యులను చేయనివ్వలేదు. లినీ లేఖ, చివరి నిమిషంలో ఆమె తీసుకున్న నిర్ణయం అందరితో కంటతడి పెట్టిస్తున్నాయి. లిని నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు.