కొద్దిరోజుల క్రితం మావోయిస్టుల హత్య చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి చోటు కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కిడారి పెద్ద కుమారుడైన శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగిస్తే, ప్రజలు ముఖ్యంగా గిరిజనుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని బాబు భావిస్తున్నాట్టు తెలుస్తోంది. క్యాబినెట్లో గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించలేదనే విమర్శలకు అడ్డుకట్టపడటమే కాదు, రాజకీయంగా లబ్ది చేకూరుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిడారి తనయుడికి మంత్రిగా అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా, మైనారిటీలు ఆ పార్టీ నుంచి ఒక్కరూ ఎన్నిక కాలేదు. దీంతో మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదు. ఎస్టీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికైనా ఆయనకు అవకాశం రాలేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో మైనార్టీ, గిరిజన వర్గాలకు చెందిన సభ్యులున్నా కొన్ని కారణాలతో వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో తాజాగా మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది.ఎమ్మెల్సీ షరీఫ్ ప్రతు బలంగా వినిపిస్తున్నా మైనారిటీల జనాభా అధికంగా ఉన్న రాయలసీమకు ప్రాతినిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫరూక్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే శాసనసభ, మండలిలో ఎందులోనూ శ్రావణ్ సభ్యుడు కాకపోయినా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలల్లోగా ఆయా సభలకు ఒక సభ్యునిగా ఎన్నికవ్వాలి. ఈలోగా సాధారణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేదు. కాబట్టి ముందు శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆ తరువాత సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించనున్నట్టు తెలుస్తోంది.