Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చివరకు కాంగ్రెస్ లోకే అని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానానికి ఎదురు తిరిగిన నల్లారి సమైక్యవాదులకు హీరో కాగా, తెలంగాణ వాదులకు విలన్ అనిపించారు. మంత్రి కాకుండానే ఏకంగా సీఎం పీఠమెక్కి కాంగ్రెస్ లో హేమాహేమీలని కంగు తినిపించిన నల్లారి తన పాలన కాలంలో గట్టి సీఎం గానే కనపడ్డారు. విభజన తర్వాత మాత్రం రాజకీయంలో తేలిపోయారు. ఆయన స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ ని జనం తిరస్కరించారు.
అప్పటి నుంచి మౌనం గా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావడానికి చేయని ప్రయత్నం లేదు. తాను ఎదిరించి బయటికి వచ్చిన కాంగ్రెస్ తప్ప దాదాపు అన్ని పార్టీల్లోకి కిరణ్ వెళతాడని వార్తలు వచ్చాయి. బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన లోకి కిరణ్ చేరతాడని ఎప్పుడోకప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లు అనుకోడానికి వీల్లేదు. ఆ దిశగా కొన్ని లోపాయికారీ ప్రయత్నాలు జరిగినా రెండు వర్గాలకి అనువైన పరిష్కారం దొరక్కపోవడంతో అవి విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి. కొన్నాళ్ల పాటు కిరణ్ సైతం తనకు భారీ డిమాండ్ ఉంటుందన్న భ్రమల్లో ఉండిపోయారు. కాలం గడిచే కొద్దీ ఒక్కొరితో ఎదురైన అనుభవాల్ని బేరీజు వేసుకుని చూస్తే తాను ఎదురు తిరిగినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ తనను మర్యాదగానే చూసిందని కిరణ్ కి అనిపించిందట. అందుకే కిరణ్ తనకున్న పాత పరిచయాల్ని తిరగదోడి తన కుటుంబం ఎప్పటినుంచో వుంటూ వస్తూన్న కాంగ్రెస్ లోనే చేరాలని డిసైడ్ అయ్యారట. ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయని, త్వరలో ఆ చేరిక ఉండొచ్చని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు