Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాజకీయాల్లో ఓ దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని రాజకీయంగా ఢీకొట్ట్టగలిగే నాయకుడే లేదు. కెసిఆర్ ని కొద్దో గొప్పో ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి నోరు పెద్దదే అయినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ టీడీపీ మీద ప్రస్తుతానికి తెలంగాణ ప్రజల్లో పెద్దగా ఆశలు, ఆకాంక్షలు లేవు. ఇక తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ లో అందరూ వీరులే కానీ కత్తి దూయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తెలంగాణ మీద కన్నేసినా ఇక్కడ ఆ పార్టీ బలం, పరిస్థితి చూస్తే అదంత తేలిక కాదని అర్ధం అయిపోతుంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తే కెసిఆర్ ని ఢీకొట్టాలంటే పార్టీ ల కన్నా సొంత బలం ని నమ్ముకుని పని చేసుకుంటూ వెళ్లే నాయకుడే కావాలి. అది కూడా ఆషామాషీగా కాకుండా ఓ వ్యూహం ప్రకారం చేయగలిగి ఉండాలి. ఇంత చొరవ, తెగువ చూపడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను సీఎం అభ్యర్థి అని చెప్పగలిగే ధైర్యం చేసింది ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే.
తెలంగాణ రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యాన్ని వాడుకుంటూ తమ సొంతబలం తో సీఎం కుర్చీ అందుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తప్పించి ఆ స్థానంలోకి వెళ్లి కూర్చోడానికి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక ఇందుకు అవసరమైన మీడియా బలాన్ని సొంతంగా సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేశారు. ఓ దినపత్రిక నడిపేందుకు ట్రై చేస్తున్నారు. వీరి ఆర్ధిక బలం, రాజకీయ దూకుడు చూసి ఓ టైం లో 10 జనపథ్ ముచ్చటపడి వీరికి పీసీసీ పీఠం ఇవ్వడానికి రెడీ అయ్యింది. కానీ ఎక్కడో తేడా వచ్చింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా వీరి ఆలోచనలకు భిన్నంగా, ఉత్తమ్ ని బలపర్చడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ కాదనుకున్నా తమకున్న బలం చెప్పి ఏదో ఒక పార్టీ ద్వారా సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని మరీ కెసిఆర్ ని ఢీకొట్టాలని కోమటిరెడ్డి బ్రదర్స్ నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలిసి బీజేపీ వీరిని సంప్రదించిందట. ఆ దిశగా కొన్ని సమావేశాల తర్వాత కాంగ్రెస్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ని నిలుపుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే టార్గెట్ సీఎం కుర్చీ, పార్టీ ఏదైనా ఓకే అన్న రీతిలో వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అదే విషయాన్ని తమతో సంప్రదిస్తున్న పార్టీలకు స్పష్టంగా చెప్పేస్తున్నారట. ఈ దూకుడు చూసి కాంగ్రెస్, బీజేపీ ఆశ్చర్యపోతుంటే సీఎం కెసిఆర్ సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ ని తేలిగ్గా చూస్తే నష్టం తప్పదని డిసైడ్ అయ్యారంట.
మరిన్ని వార్తలు: