టీఆర్ఎస్ తీరుపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొండా మురళితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవలే టీఆర్‌ఎస్ ప్రకటించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని, బీసీ మహిళననే నా పేరు ప్రకటించకుండా అవమానించారని ఆరోపించారు. మేం చేసిన తప్పేంటో తెలియజేయాలన్నారు. కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా డబ్బులు ఖర్చు చేసి గెలిపించామని వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని, వరంగల్ తూర్పు నుంచి భారీ మెజార్టీతో గెలిచానని మంత్రి పదవి కానీ ఎమ్మెల్సీ పదవి గానీ ఊసెత్తలేదని ఆమె విమర్శించారు.
105 టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాము చేసిన తప్పేంటో చెప్పాలని టీఆర్ఎస్ హైకమాండ్‌ను ప్రశ్నించారు. ఒకప్పుడు తనను తిట్టిన ఎర్రబెల్లి కేసీఆర్‌కు ఇప్పుడు ఎందుకు తీపి అయ్యారు? మేం ఎందుకు చేదు అయ్యాం? అని ఆమె ప్రశ్నించారు. పరకాల, భూపాలపల్లిలో ఏదో ఒక టికెట్ ఇస్తామని కేటీఆర్ చెప్పారని ఐనా తొలి జాబితాలో నా పేరు లేదు. లిస్ట్ ప్రకటించిన తర్వాత కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుకు ఫోన్ చేసినా స్పందించలేదు. తమాను పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆమె విమర్శించారు. మాకు టికెట్ రాకుండా కేటీఆర్ కుట్రలు చేశారని ఆమె ఆరోపించారు. ఎంపీ సుమన్‌కు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరమేంటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే సమాధానం బట్టే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కొండా సురేఖ స్పష్టం చేశారు.