Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పోరాటం సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ నంద్యాల ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నాడు. ఇందుకోసం తాను స్వయంగా అక్కడే 10 రోజుల పాటు మకాం వేయబోతున్నాడు. తనతో పాటు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల నంద్యాల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక ఖరారు చేశారు. నంద్యాలలో ప్రస్తుతం ఎవరు గెలుస్తారు అన్నది పక్కనబెడితే టీడీపీ కి వైసీపీ గట్టి పోటీ ఇస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే జగన్ స్పీడ్ కి ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో బ్రేక్ పడేట్టు వుంది.
నంద్యాల ఎప్పటినుంచో కాంగ్రెస్ అనుకూల నియోజకవర్గం. అయితే విభజన దెబ్బకి సీన్ మారింది. అయినా ఇప్పటికీ నంద్యాల లో కాంగ్రెస్ కి కొద్దిపాటి ఓటు బ్యాంకు వుంది. అయితే ఇక్కడ వైసీపీ గెలిస్తే చంద్రబాబు దూకుడుకి అడ్డుకట్ట వేయగలమని పీసీసీ కూడా భావిస్తోంది. అందుకే నంద్యాలలో పార్టీ అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంలో స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తోంది. ఈ వ్యవహారం వైసీపీ కి కలిసి వస్తోంది. అక్కడే సీన్ రివర్స్ అయ్యేలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. నంద్యాలలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. లేకుంటే కాంగ్రెస్ కి రాజీనామా చేస్తానని బెదిరించే స్థాయికి వచ్చారట. దీంతో పీసీసీ పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ గనుక అభ్యర్థిని నిలబెడితే ఆ ఓట్ల చీలిక తో వైసీపీ కి దెబ్బ పడుతుందని జగన్ ఆదుర్దా పడుతున్నారు. మొత్తానికి అదను చూసి కోట్ల పెట్టిన మెలిక జగన్ ఆశల మీద నీళ్లు చల్లేట్టు వుంది.
మరిన్ని వార్తలు