Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదలయిన వెంటనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని అంతా భావించారు. అయితే ‘బాహుబలి’ మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ పార్ట్‌ను మరింత జాగ్రత్తగా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. ‘బాహుబలి 2’ బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా కలెక్షన్స్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. ‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నారు. కాని వెంటనే ‘సాహో’ చిత్రాన్ని ప్రారంభించాడు. ప్రభాస్ పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరోసారి ప్రభాస్ వివాహం గురించి స్పందించాడు. ప్రభాస్ కోసం అమ్మాయిని వెదికే పని జరుగుతుందని, కొంత మందిని ఎంపిక చేశాం. త్వరలోనే ప్రభాస్ ఒక అమ్మాయిని ఎంపిక చేసే అవకాశం ఉందని కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మా కుటుంబం అంతా కూడా ప్రభాస్ ఒకే చెప్పడం కోసం ఎదురు చూస్తున్నామని కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రభాస్ ఓకే చెప్తాడో ఆ వెంటనే పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతాయి అంటూ కృష్ణంరాజు పేర్కొన్నాడు. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ ఓకే అంటాడు అనే నమ్మకంతో కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ప్రభాస్ ప్రేమలో ఉన్నాడు, అనుష్కను పెళ్లి చేసుకుంటాడు అంటూ కొందరు అంటున్నారు. అనుష్క, ప్రభాస్‌ల ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అంటూ సినీ వర్గాల్లో కొందరు అంటున్నారు. మరి కృష్ణంరాజు మాత్రం ప్రభాస్ కోసం అమ్మాయిని వెదుకుతున్నాం అంటున్నాడు. ఏది నిజమో, ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవాలని ఎక్కువ శాతం మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ వివాహం గురించి ఎలాంటి ఆసక్తికర విషయాలను వినాల్సి ఉంటుందో చూడాలి.