మేము దేశం కోసం…బాబు తెలుగుదేశం కోసం !

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా నియమితులైన కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు తాము రుణపడి ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ది చిరస్మరణీయమైన, మరచిపోలేని విజయమని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 98లక్షల ఓట్లు వచ్చాయని కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు 48లక్షల వ్యత్యాసం ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు తాను చెప్పిన మాట నిజమైందని, 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని ఎద్దేవా చేసారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. ప్రజాకూటమిని బలవంతంగా జనంపై రుద్దే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీడియా, డబ్బు బలంతో ప్రజలు అయోమయం చేయాలనుకున్నారని విమర్శించారు. ప్రజా చైతన్యం ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని అన్నారు. కాంగ్రెస్‌ గెలిచిన చోట ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ప్రజల తీర్పును సమీక్షించాలని, ఆరోపణలు సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా టీఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాలకు మించి గెలవలేదని జోస్యం చెప్పారు.

మేము దేశం కోసం...బాబు తెలుగుదేశం కోసం ! - Telugu Bullet

కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలకే ఎక్కువ అవకాశం ఉందని, గత ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రాన్ని శాసించగలమని, దేశానికి తెలంగాణను దిక్సూచిగా మారుస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని బూచిగా చూపి టీడీపీని బలపర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నమని ఆరోపించారు. కేసీఆర్ దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం దేశం కోసం కాకుండా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌ వైపు ఉన్నారని అయితే కాంగ్రెస్‌, బీజేపీకి సంబంధంలేని ఫ్రంట్‌ మాది అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలేనని పార్టీలన్నింటినీ ఏకం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది కనుక ఏపీ కూడా దేశంలో అంతర్భాగం కనుక అక్కడ కూడా తమ జోక్యం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తే చంద్రబాబుకు అనుకూలంగా లేవని ఏపీలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయని అన్నారు. అక్కడి రాజకీయాలు అనూహ్యంగా మారతున్నాయన్నారు.