Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రమాణస్వీకారానికి ముందే కావేరీ నదీ జలాలపై కుమారస్వామి తన వైఖరి వెల్లడించారు. కావేరీ జలాల వ్యవహారంలో కాంగ్రెస్ పాటించిన విధానాన్నే తాను కూడా పాటిస్తానని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడుకు నీటి విడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కావేరీ నదీ జలాలను దిగువున ఉన్న తమిళనాడుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయాలంటూ రజనీకాంత్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అవసరాలకు సరిపడినంత నీరుంటేనే దిగువకు విడుదల సాధ్యమని, కావాలంటే రజనీకాంత్ కర్నాటకకు వచ్చి ఇక్కడి జలాశయాలు, రైతుల పరిస్థితి చూడాలని సూచించారు. ఆయన్ను తాను ఆహ్వానిస్తున్నానని, ఇక్కడకు వచ్చి చూసిన తర్వాత కూడా నీరు కావాలని కోరితే, ఆపై చర్చించుకుందామని అన్నారు.
కర్నాటక గతంలో ప్రతి ఏటా 192 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సి ఉండగా… ఈ ఏడాడి ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు దానిని సవరిస్తూ 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఆ నీరు కూడా ఇచ్చేది లేదని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భీష్మించారు. దీంతో కావేరీ జలాల నిర్వహణాబోర్డు ఏర్పాటుచేయాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు వ్యాప్తంగా ఈ అంశంపై ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వమయినా తమిళనాడు ప్రజల పరిస్థితిని అర్ధం చేసుకుని కావేరీ నీటిని విడుదల చేయాలని రజనీకాంత్ కోరారు. అయితే గత ప్రభుత్వ వైఖరినే తానూ కొనసాగిస్తానని కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి కుండబద్ధలు కొట్టారు.