Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామికి ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్ అధికారులను ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇటీవల కోహ్లి విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ… తాజాగా తన ఫిట్నెస్ ప్రాక్టీస్‌ను పోస్ట్ చేశారు. ఉదయం వేళ ఎక్సర్సైజ్ చేస్తూ… ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని మోదీ తెలిపారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు.
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కౌంటరిచ్చారు. ఆయన తనదైన శైలిలో మోడీకి కౌంటర్ ఇచ్చారు. యోగా, వ్యాయామం తన దినచర్యలో భాగమేనని ఒప్పుకుంటూనే రాష్ట్రాభివృద్ధి వైపే తన దృష్టంతా అని పేర్కొన్నారు. ఇందుకు మోడీ సహకారాన్ని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ‘మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఫిజికల్ ట్రెడ్మిల్, యోగా నా దినచర్యలో భాగం. ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. అయినప్పటికీ… మా రాష్ట్ర అభివృద్ధిపైనే నా దృష్టంతా… ఈ విషయంలో మీ సహకారాన్ని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్ ద్వారా ప్రధానికి కుమారస్వామి జవాబిచ్చారు.