లగడపాటి చెప్పిన అభ్యర్థిదే తొలి ఓటమి

Complaint File On Lagadapati

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.టీఆర్ఎస్ జగిత్యాలలో తొలి విజయం నమోదు చేసింది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించి, టీఆర్ఎస్‌కు తొలి విజయాన్ని అందించాడు. అయితే, రెండు రోజుల కిందట జీవన్ రెడ్డికి లగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి, జగిత్యాల నుంచి విజయం సాధిస్తున్నట్టు చెప్పారు. అన్నా నువ్వు గెలుస్తున్నావ్‌. ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది. నీకు మంత్రి పదవి కూడా వస్తుందని జీవన్‌రెడ్డికి చెప్పారని నిన్న ప్రచార్రం జరిగింది. అయితే అనూహ్యంగా జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. లగడపాటి సర్వేలు కూడా తల్లకిందులయ్యాయి. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంజయ్‌కుమార్‌ ఈ సారి ఆయనపై విజయం సాధించారు. దీంతో జీవన్‌రెడ్డి విజయాల పరంపరకు బ్రేక్‌ పడింది. ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్‌, వై.ఎస్‌ మంత్రివర్గాల్లో మంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ గెలుపొందినా జగిత్యాలలో మాత్రం జీవన్‌రెడ్డి విజయం సాధించారు. కానీ ఈ సారి మాత్రం ఆయనకు ఓటమి తప్పలేదు.