వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. నటీనటుల ఎంపిక కూడా జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు ఎలా అధికారాన్ని లాక్కున్నాడు, లక్ష్మీ పార్వతి పాత్ర ఏంటీ అనే విషయాలను వర్మ చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పుస్తకంలో చిరిగిన, చింపేయబడ్డ పేజీలను తాను అతికిస్తాను అంటూ వర్మ చెబుతున్నాడు.
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం చేయడంపై తెలుగు దేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా వర్మ మాత్రం తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే తెలుగు దేశం మద్దతుదారుడు అయిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూంగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని కేతిరెడ్డి ఇప్పటికే మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలకు కూడా లక్ష్మీ పార్వతి అనుమతి తప్పనిసరి. వర్మ సినిమాకు లక్ష్మీ పార్వతి ఓకే చెప్పినా కూడా కేతిరెడ్డి సినిమాకు మాత్రం నో చెబుతుంది.
వర్మ సినిమాకు ఓకే చెప్పి, కేతిరెడ్డి తీయబోతున్న సినిమాకు నో చెప్పడం వల్ల లక్ష్మీ పార్వతిపై విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకే వర్మ సినిమాకు కూడా అనుమతి ఇవ్వక పోవచ్చు అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. తన పేరుతో, తన భర్త గురించి సినిమాను తన అనుమతి లేకుండా తీయడం చట్ట విరుద్దం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికే కేతిరెడ్డి సినిమాను ఆపేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మీ పార్వతి రెండు సినిమాలకు కూడా అనుమతి ఇవ్వక పోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాకు ఇచ్చి మరో సినిమాకు ఇవ్వక పోవడం వల్ల తానే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే లక్ష్మీ పార్వతి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి కూడా అనుమతి నిరాకరించే అవకాశం ఉంది. ఈ పరిణామం వర్మకు పెద్ద షాక్‌ను మిగిల్చే అవకాశం ఉంది.