Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మిగతా రోజులతో పోలిస్తే… ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కార్యకలాపాలు 15 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాల అభిశంసన నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడమే ఇందుకు కారుణంగా తెలుస్తోంది. సాధారణంగా రోజూ ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి సమావేశమవుతారు. అయితే 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఈ సమావేశం ఉండదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ మాత్రం 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. దీంతో విచారణ కార్యకలాపాలు 15 నిమిషాలు ఆలస్యమయ్యాయి. అటు అభిశంసన నోటీసును వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే రాజ్యసభ చైర్మన్ పని అని, నోటీసును తిరస్కరించే అధికారం ఆయనకు లేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు.
తన వద్దకు వచ్చిన తీర్మానంలో 50 మంది కంటే ఎక్కువమంది ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలని, ఏ విషయం ఆధారంగా వెంకయ్య తీర్మానాన్ని తిరస్కరించారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఎంపీలు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తూ వెంకయ్య అందుకు గల కారణాలను వివరించారు. నోటీసుపై సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై కచ్చితత్వంలేదని, ఆరోపణలకు సంబంధించి జరిగిఉండవచ్చు… అవకాశముంది… పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాతే నోటీసులను తిరస్కరించినట్టు వివరించారు. అటు ఎన్నో కేసుల్లో సంచలన తీర్పులిచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా… తనపై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత యథావిధిగా తన బాధ్యతలు కొనసాగించారు.
కొన్నినెలల క్రితం దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన పద్మావత్ సినిమాపై దాఖలైన పిటిషన్ పై దీపక్ మిశ్రా తీర్పు ఇచ్చారు. పద్మావత్ లోని ఆఖరి సన్నివేశంలో సతీ సహగమన దృశ్యాలు చూపించారని, ఆ సన్నివేశం తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ లో పేర్కొన్న సతీసహగమన అంశాలను చదివిని జస్టిస్ దీపక్ మిశ్రా సినిమాలోని సన్నివేశం చూసి మహిళలు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకుంటారని మీకు అనిపిస్తోందా…? ఇన్నేళ్లలో మహిళా సాధికారత పెరుగుతూ వచ్చింది అని వ్యాఖ్యానిస్తూ… ఆ పిటిషన్ తిరస్కరించారు.