Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముందు ప్రచారం జరిగినట్టుగా లోక్ సభ నిరవధిక వాయిదా పడలేదు. సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించకపోవడంతో ఎప్పటిలానే స్పీకర్ సుమిత్రామహాజన్ మరుసటిరోజుకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే రోజూలానే అన్నాడీఎంకె సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటుచేయాలని కోరుతూ స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి పునరావృతమయింది. అన్నాడీఎంకె సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ అవిశ్వాసం సహా అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినా సభ్యులు వెనక్కితగ్గలేదు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసతీర్మానాలు 12వరోజూ చర్చకు రాకుండానే సభ వాయిదా పడింది. అసలైతే సభ ఇవాళ నిరవధిక వాయిదాపడనున్నట్టు తొలుత ప్రచారం జరిగింది. నిరవధిక వాయిదావేస్తే అనుసరించాల్సిన వ్యూహాల్నికూడా టీడీపీ, వైసీపీ సిద్ధంచేసుకున్నాయి. లోక్ సభలోనుంచి బయటకు రాకుండా నిరసనలు కొనసాగించాలని టీడీపీ, ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి….ఆమరణదీక్షకు దిగాలని వైసీపీ భావించాయి. కానీ సభ రేపు కూడా కొనసాగనుండడంతో…టీడీపీ, వైసీపీ వెనక్కి తగ్గాయి. చివరిరోజైన రేపయినా అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.