Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యక్రమాలు , పార్టీ అంతర్గత వ్యవహారాలకు పరిమితం అవుతూ వస్తున్న లోకేష్ ఇప్పుడు నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని ఢీకొంటున్నారు. అమిత్ షా లేఖ మీద లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర సమస్యల మీద అమిత్ షా కి అవగాహన లేక మాట్లాడుతున్నారని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కేంద్రం మీద వున్న అసంతృప్తిని సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు వివరించినా ప్రధాని మోడీ పట్టించుకోలేదని లోకేష్ వ్యాఖ్యానించారు. తాము ఆవేశంతో నిర్ణయం తీసుకోలేదని , ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని లోకేష్ వివరించారు. కేంద్రానికి ఎప్పటికప్పుడు వివిధ పనులకి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ పంపుతున్నామని చెప్పిన లోకేష్ …అసలు వాటికి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధం ఏంటని నిలదీశారు. అమిత్ షా లేఖ చూసాక ఆయనకి రాష్ట్ర సమస్యల మీద అవగాహన లేనట్టు అర్ధం అయ్యిందని లోకేష్ చెప్పారు. అమిత్ షా లేఖకు త్వరలో చంద్రబాబు కూడా కౌంటర్ ఇస్తారని లోకేష్ తెలిపారు.
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో చంద్రబాబు మీద కోపంతో రగిలిపోతున్న బీజేపీ అగ్ర ద్వయం మోడీ , అమిత్ షా ప్రతీకారం తీర్చుకుంటారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా లోకేష్ ని టార్గెట్ చేసే అవకాశం వుంది అంటున్నారు .ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకుముందే లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షా మీద లోకేష్ నేరుగా కామెంట్స్ చేయడం సాహసమే. అయినా లోకేష్ ముందుకు రావడం టీడీపీ శ్రేణుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాన్ని బట్టి మోడీ , అమిత్ షా ఏమి చేసినా దీటుగా ఎదుర్కోడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా వుంది అనుకోవాలి.