రేపు రాత్రికి సంపూర్ణ సుదీర్ఘ ఖగోళ అద్భుతాన్నిచూడొచ్చు. రేపు జులై 27 (శుక్రవారం) రాత్రి సరిగ్గా 11.44 గంటలకు నుంచి చంద్ర గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే. అర్ధరాత్రి 1.51 గంటలకు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. 2.43 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా.. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాల వల్ల ఆ అవకాశం దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయిలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. చంద్రగ్రహణం సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. సంప్రోక్షణ అనంతరం 28వ తేదీ నుంచి దర్శనాలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.
అయితే రేపు వస్తున్న ఈ చంద్ర గ్రహణానికి మరో విశిష్టత ఉంది. ఆ రోజు అంగారక గ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. 2003 తర్వాత ఇంత దగ్గరగా వస్తుండటం ఇదే తొలిసారి. గతంలో సుదీర్ఘమైన చంద్ర గ్రహణం 1700 సంవత్సరాల కిందట వచ్చిందట. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాదే ఎక్కువ సమయం పాటు చంద్ర గ్రహణం కొనసాగనుంది. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూసినా ఇబ్బందేం ఉండదు. గర్భిణులు, కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు రాత్రి 7.30 గంటల్లోగా భోజనం ముగించడం మంచిది.