‘మహానటి’కి వాయిదా తప్పదా?

Mahanati Movie Release Postponement
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు, తమిళంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రం మార్చి చివరి వారంలో విడుదల కాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. సావిత్రి జీవిత కథ అవ్వడంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని అంతా అతృతతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశాలున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం విడుదలకు ఒక్క రోజు తేడాతో రామ్‌ చరణ్‌ రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబో మరియు సమంత హీరోయిన్‌గా నటించడంతో సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకే రోజు తేడాతో విడుదలైతే ఖచ్చితంగా రెండు చిత్రాలపై ప్రభావం పడుతుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. అందుకే రెండు చిత్రాల్లో ఒక చిత్రాన్ని వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులతో ఒక నిర్మాత ఈ విషయమై మాట్లాడాడు అని, వారు ఒక వారం ఆలస్యంగా సినిమాను విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి ‘మహానటి’ చిత్రం ముందుగా అనుకున్నట్లుగా కాకుండా ఒక్క వారం ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో సమంత కీలక పాత్రలో కనిపించబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు.