Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీకి కొన్ని రాజకీయపక్షాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఎన్డీఏ నుంచి వైదొలగాలని టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే విపత్తు నుంచి దేశాన్ని రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను తలపిస్తున్నాయని, ఈ సందర్భంలో తాను ఒక్కటే కోరుతున్నానని, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత్వం, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని మమత తన ట్వీట్ లో కోరారు.
తొలినుంచీ కేంద్రప్రభుత్వాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తృణమూల్ తో పాటు… ఇటీవలే గోరఖ్ పూర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన సమాజ్ వాదీ పార్టీ కూడా టీడీపీకి అండగా నిలబడింది. నాలుగేళ్ల పాటు బీజేపీ వెంట ఉన్న చంద్రబాబును ఆ పార్టీ మోసం చేసిందని ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటకి రావడం శుభపరిణామమన్నారు. కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసతీర్మానానికి తాము మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.